9. కొలత

“ఎసరు పెట్టేస్తుంది అమ్మ. బియ్యం కొలిచిన గ్లాసు ఎక్కడ పెట్టావు ప్రియ వదినా?” అంటూ బయట నుండి అరుస్తూ అడిగింది మా చిదానందం అన్నయ్య భార్య, అదే, మా పెద్దనాన్న కోడలు. నేను బాల్కనీ వైపు ఉన్న బాత్రూములో ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉన్న నాకు, ఒక్కసారి షాక్కొట్టినట్టు అనిపించింది. “ఒక్క నిమిషంలో వస్తున్నా,” అని చెప్పి ఆగమన్నాను. “అలాగే,” అని చెప్పి తను లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. గబుక్కున అక్కడే ఉన్న ప్లాస్టిక్ స్టూల్ మీద ఒక్క సారిగా చతిగిలబడ్డాను. బుర్ర తిరిగి పోతున్నట్టు అనిపించింది. మనస్సు వెనక్కి పరుగులు తీసింది.

నేను కూర్చున్నది ఒకే ఒక పెళ్ళిచూపులలో. అదీ మా ఆయన నన్ను చూడడానికి వచ్చినప్పుడు. నాన్న చిన్ననాటి స్నేహితుడి కొడుకు. ఆ చనువు ఉంది కనుక, వాళ్ళు కబురు పెట్టక ముందే నేను వాళ్ళ అబ్బాయికి నచ్చానో లేదో తెలుసుకోవాలని నాన్న ఆతృతగా వాళ్ళింటికి వెళ్ళారు. ఆ మహా నగరంలో మేమొక మూల ఉండే వాళ్ళము. నాన్న తన ఆఫీసుకి వెళ్ళి, అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. నాన్న ఫోన్ కాల్ కోసం ఇంట్లో అందరం ఎదురు చూస్తున్నాము. ఫోను మ్రోగితే చాలు, నాన్నే చేశారేమోనని ఆతృతగా మాట్లాడేయడమే. కాదని తెలిసి నాలుక కరుచు కున్నాము. అలా చాలా సార్లు అయింది అవాళ.

అలా ఫోను మ్రోగిందంటే చాలు, ఆతృతగా పరుగున వెళ్ళి రిసీవర్ తీయడం, ఎవరో చేశారని అమ్మకిచ్చి, ఆందోళనగా అక్కడనుండి  వెళ్ళిపోవడం. ఇదంతా చూసి, అమ్మ, “ఎందుకే పిచ్చి పిల్లా అంత హడావిడి. సంబంధం కుదరడమంటే అంత తేలికేం కాదు. ఫోన్ వస్తుందిలే. టైం మూడు కొట్టింది. ముందు కొంచెం ఎంగిలి పడు. ప్రొద్దున్నుండీ ఏమీ సరిగ్గా తినలేదు. అసలే నీ తిండి అంతంత మాత్రం. అయినా నాన్న అతని గురించి అన్నీ వాకబు చేయించారుగా.అంతా చక్కని కుర్రాడేనని చెప్పారుగా. ఇంకా ఎందుకీ ఆందోళన? రా. కొంచెం పెరుగన్నమన్నా తిను,” అంది. “అందుకే కదమ్మా  నా ఆదుర్దా కూడా. ఇలాంటి సంబంధం కుదరాలనే. బావ ఎట్లాగో మనలో సరిగ్గా కలవడు. కనీసం నన్ను చేసుకునే అతనైనా మనలో కలిసే మనిషైతే చాలు. ఇతనితో మాట్లాడినప్పుడు నాకు ఆ కలివిడి లక్షణం బాగా నచ్చిందమ్మా,” అన్నాను. అంతే, అమాంతం వచ్చి నన్ను హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మ. ఆడపిల్ల మెట్టినింటి గురించి వంద రకాల ఆలోచిస్తారు తల్లిదండ్రులు. అలాగే, ఆ వచ్చే అల్లుడు ఇక్కడ కూడ కలివిడిగా ఉండాలనుకోవడం పరిపాటే కదా!

ఇంతలో మళ్ళీ ఫోన్ మ్రోగింది. ఈ సారి అమ్మే తీసుకుంది. నాన్నే ఆ ఫోన్ చేసింది. నాన్న చెప్పింది విని, నా కేసి చూస్తూ నవ్వింది. “కాయా? పండా?” అనే సైగ చేసి అడిగాను ఆదుర్దాగా అమ్మని. సంతోషంగా నవ్వుతూ, “పండే” అని చెప్పి రిసీవర్ నాకిచ్చి నాన్నతో మాట్లాడమంది. అదే వార్త నాన్న నాకు చెప్పి విష్ చేశారు. తరువాత ఆయన కూడ “హాయ్. కంగ్రాట్స్” అన్నారు. చాలా ఆనంద పడ్డాను. అఫ్ కోర్స్, దానికి అవధులు ఏముంటాయి!

తరువాత, ఆయన చెల్లెలు కూడ ఫోన్ తీసుకుని, “హార్టీ కంగ్రాట్యులేషన్స్,” అంది. “థాంక్యూ. నీ పేరేంటి? మనమిద్దరం ఒకే ఏజ్ వాళ్ళం కదా … అందుకోసం పేరు పెట్టి పిలుచుకుందాము” అన్నాను. అదే నేను వేసిన మొట్టమొదటి తప్పటడుగు. పెళ్ళి కుదిరిన ఆనందంలో మైకం కమ్మిందా? … అయ్యుండచ్చు.

మా వివాహం జరిగింది. కొద్ది నెలలు గడిచాయి. మా అత్తారింట్లో సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు పెడతారు. మా ఆయన కూడ చాల సరదాగా చేయగలిగినవి చేస్తారు. పండుగ రోజు సాయంకాలం చుట్టాలను, చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలిచాము. మా అమ్మ, అక్క కూడ వచ్చారు. మా పుట్టింట్లో ఈ బొమ్మల కొలువు ఆనవాయితీ లేదు. అదీగాక, నేను ఎప్పుడూ ఇలాంటి వాటిల్లో పెద్దగా ఆసక్తి చూపించ లేదు. మా అత్తగారు నా చేత కూడ బొమ్మలు పెట్టిచ్చారు. ఏదో ముభావంగానే చేశాను. అదీగాక, ఎప్పుడు ఈ గోల అయిపోతుందా, వెళ్ళి భోజనం చేసి పడుకుందామా అని ఎదురుచూస్తున్నాను.

ఇంతలో మా ఆయన కజిన్, వాళ్ళ బాబాయి కూతురు, ఆమె భర్త వచ్చారు. ఆమె, మా ఆయన చెల్లెలికన్నా కొద్ది నెలలు పెద్దది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం టైములో మా ఆయన చెల్లెలి మీద నాకు ఏదో విషయం మీద కోపం వచ్చినందున, వాళ్ళ బాబాయి కూతురు రాగానే, అంతవరకు పేరంటానికి సంబంధించిన ఏ విషయంలోనూ ఇంట్రస్ట్ చూపించని నేను, గబుక్కున వెళ్ళి “రా వదినా,” అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకు వచ్చాను. ఉన్నట్లుండి అందరూ నా వైపు అదోరకంగా చూశారు … మా అమ్మ, అక్కతో సహా. వాళ్ళ బాబాయి కూతురు కూడ కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయింది.

పేరంటం ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. ఆడ వాళ్ళ పేరంటం కదా, మగవాళ్ళందరూ లోపల ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో అమ్మ మా అత్తగారి దగ్గరకెళ్ళి, మా నాన్నకి కొంచం బెంగగా ఉంది, నన్ను తనతో తీసుకెళ్ళి, రెండు రోజులు ఉంచుకుని పంపుతానంది. ఆవిడ సరే అనడంతో మా ఆయనకి కూడ చెప్పి నన్ను తనతో తీసుకెళతానంది. మా ఆయన వచ్చి, నన్ను, అమ్మని, అక్కని బస్సు ఎక్కించి వెళ్ళారు. నేను ఉన్నట్లుండి ఎందుకు వెళ్తున్నానో నాకు అర్థం కాలేదు.

ఇంటికి వెళ్ళిన తరువాత, అందరం కూర్చుని భోజనం చేస్తున్నాము. అమ్మ, వడ్డిస్తోంది. నాకు ఇష్టమని అప్పటికప్పుడు, అమ్మ పరవన్నం చేసింది. కప్పులో మారు వడ్డిస్తూ తీయగా, “నువ్వు చేసింది చాల పెద్ద పొరపాటు,” అంది అమ్మ నాతోటి. దారి పొడుగునా అమ్మ నాతో ముభావంగానే ఉంది. “తను నాతో ఎట్లా ఉంటుందో నీకు తెలుసా?” అన్నాను కొంచెం గట్టిగా. “ఔనమ్మా, అలాంటి వాళ్ళకి అలాగే బుద్ది చెప్పాలి,” అంది అక్క వంత పాడుతూ. నాకు విపరీతమైన ఉత్సాహం వచ్చింది. “నువ్వు నోరు ముయ్యి,” అని కళ్ళెర్రజేసి గట్టిగా అరిచారు నాన్న అక్కకేసి చూసి.

నాన్నని అంత కోపంగా నేనెన్నడు చూడ లేదు. అసలు అమ్మ నాన్నకి ఆ విషయం ఎప్పుడు చెప్పింది కూడ మాకు తెలియదు. అదీగాక, కూతుళ్ళంటే ఆయనకి చాల ఇష్టం.

“నీ బిహేవయర్ మూలంగానేగా మీ ఆయన, మీ అత్తారుకి, మాకు ఎడమొహం పెడమొహం అయ్యింది. అది చాలదన్నట్లు చిన్నల్లుడిని కూడ కలవకుండా చేస్తావా? ఏ తల్లిదండ్రులయినా కూతురు పెళ్ళి చేశాకా కూతురు, అల్లుడు … ఇద్దరూ వచ్చి వెళ్ళాలనుకుంటారు. ఇలా కూతురిని ఇంటికి తెచ్చుకోవాలనుకోరు. ఆ స్నేహం ఎలాగూ చెడగొట్టావు. నీ కాపురం నువ్వు చూసుకో. చిన్న దాని విషయంలో ఇంకెప్పుడూ తల దూర్చకు,” అంటూ నాన్న కంటిన్యూ చేశారు.

అదేంటి … నన్ను ఇక్కడకి తీసుకొస్తానని కదా అమ్మ అక్కడ చెప్పింది. మరి నాన్న అలా అన్నారేంటి? మతి పోయి నేను, అక్క ఒకరినొకరు చూసుకున్నాము. ఇద్దరికి నోరు పెగల్లేదు.

అప్పుడు అందుకుంది అమ్మ.

“నన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు? ఆయనని నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? దాన్ని అక్క అని ఎందుకు పిలుస్తున్నావు? మీ మేనత్తలని, మేనమామలని ఆ బంధుత్వంతో ఎందుకు పీలుస్తున్నావు? ఎందుకంటే, ఇవి బంధుత్వాలు కనుక. పెళ్ళయ్యాకా, మెట్టినింటి కెళ్ళాకా, ఆడపిల్ల ఆడ పిల్లే అంటారు … ఎందుకు? ఎందుకంటే అక్కడ బంధుత్వం ఏర్పడుతుంది కనుక. అది మన అందరికి. కాని, నీకు దానితోపాటు బంధం, అనుబంధం కూడ ఏర్పడ్డాయి. కాదా? నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన దానివి. అక్కడ బంధుత్వాన్ని చెడ గొట్టుకుని వాళ్ళ బంధువులతో బంధుత్వం నిలుపుకుంటావా? ఇదేనా నీ చదువు నీకు నేర్పింది? … నువ్వు నీ అహంకారంతో గమనించ లేదు కాని, నీ ప్రవర్తన మీ ఆయన చూశాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు … మీ ఆయన చెల్లెలికి నీ వయసే ఉంటే పేరు పెట్టి పిలుస్తున్నావు … మరి వాళ్ళ బాబాయి కూతురిదీ అదే వయసుగా? అక్కడ బంధుత్వం కలిసిందా నీకు? ఏవైపు నుండి … నా తరఫునుండా లేక మీ నాన్నగారి తరఫునుండా? అసలు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయమైంది? నీ పెళ్ళి కుదిరాకే కదా? కాని, నీకు ఆ అమ్మాయితో చుట్టరికం ఉన్నట్లు, నీ సొంత ఆడపడుచుతో ఏమీ లేనట్లు అంత మందిలో ఎలా ప్రవర్తించాలనుకున్నావు? అంత కన్ను మిన్ను కానకుండా బ్రతికేద్దాము అనుకుంటున్నావా? రేపు మీ ఆయన అడిగితే ఏం సమాధానం చెబుదామనుకుంటున్నావు? అతనికి నీ సమాధానం కచ్చితంగా నచ్చదు. అతని చూపులోనే ఆ సమాధానం ఉంది. అసలు నీ మాట వినడానికి కూడ ఇష్ట పడకపోతే ఏంచేస్తావు? కూర్చున్న కొమ్మ నరుక్కుని వచ్చి ఇక్కడ తిష్ట వేస్తావా? అందుకేనా అంత కష్టబడి సంబంధం చూసి నీకు పెళ్ళి చేసింది? నువ్విలా గిల్లికజ్జాలు పెట్టుకుని వచ్చి మా నెత్తినెక్కి కూర్చుంటావా? అయినా, తప్పు నీది కాదు. నాది. నీ పెళ్ళి కుదిరిన వెంటనే నువ్వు మీ ఆడపడుచుని “పేరు పెట్టి పిలుస్తా” నన్నప్పుడే నేను వారించి ఉంటే, విషయం ఇంత దూరం వచ్చేది కాదు. మీ నాన్న అక్కడి నుండి మాట్లాడారుగా. అందుకే ఆయన దృష్టికి వెళ్ళ లేదు. లేకపోతే అప్పుడే విషయం మారి పోయేది … మీ ఆయన చూసిన చూపుకి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చెప్పు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? వచ్చి, మీ అత్తారింట్లో నిన్ను సమర్ధించి, మీ ఆయనని ఎదిరించి, దెబ్బలాడి, బెదిరించి నిన్ను మీ ఆయనతో చక్కగా కాపురం చేసుకోమ్మా … అని దింపి రావాలా? మీ నాన్న స్నేహితుడు ఒకరు అలానే చేశారు. “నా కూతురిలో పది తప్పులుంటే, నీలో ఒక్క తప్పైనా పట్టుకోలేనా?” అంటూ వాళ్ళ ఇంటికెళ్ళి  అల్లుడిని గొడవ చేశాడట. ఏం జరిగింది? కూతురుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమి, ఆయనకేనా రోషం? అల్లుడికి ఉండకూడదా? తమ్ముడికి సంబంధాలు చూస్తున్నాము కద; ఆ వచ్చే అమ్మాయి కూడ నీలాగే ఉంటే మనం మాత్రం భరించగలమా. ఇక్కడ నువ్వు కూతురువి. కాని, అక్కడ కోడలివి. ఇది గుర్తుంచుకుని మసలుకో … ఈ విషయంలో మేము నిన్ను సమర్ధిస్తే ఇది జీవితాంతం రగులుతూనే ఉంటుంది. అందుకే విషంయం చిన్నదిగా అనిపించినా, గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇది ఇక్కడే వదిలేస్తే ఎంతదూరమైనా వెళ్ళే అవకాశముంది. కాబట్టి, నీ తప్పు నువ్వు తెలుసుకుని, నిన్ను నువ్వు సరి దిద్దుకో. అనవసరమైన మాటలు మొదలెట్టింది నువ్వే కాబట్టి, చిన్న పశ్చాత్తాపంతో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తీసుకురాకు. ఇలాంటివి చిన్నగానే కనిపించినా, వాటి లోతు తెలుసుకుని మసలుకోవాలి. అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను … ఈ విషయంలో నీకు మా దగ్గర నుండి ఏ రకమైన సమర్ధింపు రాదు. ఇక మీదట, నువ్వు ఇలా వస్తే తలుపు కూడ తియ్యమని మీ నాన్నగారు గట్టిగా చెప్పమన్నారు. మా ఆయన చెప్పింది నేను విన్నాను. రెండు రోజులు అని చెప్పి తీసుకొచ్చాను. కానీ, ఈ పూటకి ఎక్కువ ఆలోచించకుండా పడుకుని, రేపు ప్రొద్దున్న బయలు దేరి వెళ్ళి, మీ ఆయన చెప్పినట్లు నువ్వు విను.”

నాన్న లేచి అవతలకి వెళ్ళి పోయారు. అంత ఆవేశంతో మాట్లాడిన అమ్మ, ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంది. అమ్మ చెప్పిన మాటలకి అర్థం మెల్లిగా తెలియడం మొదలుపెట్టింది. అంతే, నేను తెలిసీ తెలియక చేసిన ఒక తప్పు రెండు కుటుంబాల మధ్య ఇంత వైరం, దూరం పెంచుతాయి అనుకోలేదు. ఒక్క సారిగా బాధ ముంచుకొచ్చేసింది. అంతే, అమాంతం వెళ్ళి అమ్మని గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చేశాను.

గీజరు సౌండ్ ఆగింది. కుక్కర్ సౌండ్ వినిపించింది. వంటింలోకి వెళ్ళి అడిగాను, “ఏ గ్లాసుతో పోశారు బియ్యం గిన్నెలో నీళ్ళు?” అని. మా అన్నయ్య భార్య, వాళ్ళ అమ్మ కూడ ఏదో నవ్వు నవ్వి ఊరుకున్నారు. అన్నయ్యా వాళ్ళు ఏదో పనిమీద వెళుతూ మా ఊళ్ళో ఒక రోజు ఉందామని వచ్చారు.

తరువాత తెలిసింది … కుక్కర్ వేడెక్కి ఉంటే, మా మామ్మ చెప్పినట్టు నీళ్ళు వ్రేలితో కొలిచి పోసి, బియ్యం గిన్నె కుక్కర్లో పెట్టింది మా అన్నయ్య అని. విషయమేమిటంటే, అతని భార్య కూడ తన సొంత ఆడపడుచుని ‘వదినా’ అని పిలవదు!

ఈ రోజు నాకు చేతి నిండా పనే. ఎసరు, అత్తెసరు … రెండింటి కొలతా ఈ తల్లీకూతుళ్ళిద్దరికీ నేర్పాలిగా!

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

Published by TSS Murty

Childhood, youth and middle age are keen stages of learning. I believe, the unlearning is a way to learn as we move forward from here, just as a satellite would detach itself from a few components to reach its destination. In this process, we might leave a few footsteps! Hence the effort to store a few ideas in English, Telugu and Hindi.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started