4. సమర్ధన — విచక్షణ

చిదానందం అనుకున్నట్లు ఆ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయింది. అందరం ఇంటికి వచ్చేశాము. కాళ్ళ నొప్పులతో కూర్చున్న నాకు వాడు కాస్త కొబ్బరి నూనె రాసి మర్దనా చేశాడు. నిజానికి అలసి పోయింది వాడే. అన్ని వసతులు చేస్తే ఊరికే వెళ్ళి వచ్చే సరికే ఇంత అలసట. వయసు కదా మరి.

వాళ్ళ తాతయ్య కోరిక ప్రకారం వాడి షో అయింది. ఆయన తన మనవడికి వచ్చిన పేరు తనకే వచ్చినట్లు ఎంత పొంగి పోయారో. వాణ్ణి అలా కౌగలించుకుని కొద్ది సేపు ఆ స్టేజ్ మీద ఉన్నంత సేపూ హాల్లో కరతాళ ధ్వనులు ఆగలేదు. నా కళ్ళు చమర్చాయి. అలా బావని పట్టుకుని ఉండి పోయాను. అందులో నా వంతు నేనూ చేశాను కదా. ఈ ఇంటికి కోడలిగా వచ్చి, వారికి మనవణ్ణి, మా బావకి వారసుణ్ణి, ఈ ఇంటి పేరుకి, వారు ప్రాణంలా చూసుకునే కళకి తగిన వంశోద్ధారకుణ్ణి ఇవ్వగలిగాను కదా!

ఇప్పుడే కాళ్ళు కాస్త సర్దు కుంటున్నాయి. రేపటికి అంతా నార్మల్ అయిపోయి నా పనిలో నేను పడిపోవాలి. ఇలా కుదుట పడుతున్న మనసులో పలు ఆలోచనలు కూడా పరుగెత్తడం మొదలుపెట్టాయి. ఆ గదిలో మా మావయ్య తృప్తిగా నిద్ర పోతున్నారు. “మాష్టారు గారూ” అంటూ వచ్చి ఆయన చేత బొమ్మలు గీయించుకున్న వాళ్ళు ఎంత మందో. చెయ్యి కాగితం మీద పడితే చేతనత్వమే కదా! … “అలాంటి మనిషికి ఇలాంటి భార్యా?” అనిపిస్తుంది.

నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న రోజులవి. కాలేజీకి వైవా కోసం వెళ్ళాను. అది అయి బయటికి వచ్చేసరికి చాలా మబ్బుగా ఉంది. వచ్చి తీసుకుని వెళతానన్న నాన్న ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర కుంభవృష్టి అని తెలిసింది. ఆ ప్రక్కనే మా మేనత్త ఇల్లు. అక్కడికి వెళితే వర్షం తగ్గాక వచ్చి తీసుకెళతానన్నారు నాన్న. సరేనని వెళ్ళాను. అత్త చాలా సంతోషించింది. సాయంత్రం ఉల్లిపాయ పకోడీలు వేసి పెట్టింది. నా కోసం టమాటా సాస్ కూడా తెమ్మంది. మావయ్య కూడా ఇష్టంగానే తెచ్చిపెట్టినట్టు అనిపించింది.

చీకటి పడింది. ఇంతలో నాన్న అత్తకి ఫోన్ చేశారు. నాతో కూడా మాట్లాడారు. మా ఇంటి దగ్గర రోడ్డు మీద మోకాలు లోతు నీళ్ళు నిలిచిపోయాయి. వచ్చేందుకు కానీ వెళ్ళేందుకు కానీ వేరే దారి లేదు. అయిష్టంగానే నన్ను ఆరోజుకి మా అత్త ఇంట్లో ఉండమన్నారు నాన్న. నేనెప్పుడూ వాళ్ళ ఇంట్లో ఉండలేదు. సరే ఇంక తప్పదు కనక కాసేపు అత్తతో కబుర్లు చెప్పాక అత్త వంట మొదలెడితే నేను కూర తరిగిస్తానని వెళ్ళాను. “రాకరాక వచ్చావు. మీ అమ్మానాన్నలు నిన్నసలు పంపనే పంపరు.” అంటూ ఎమీ ముట్టుకోనీయ లేదు. కాసేపు టీవీ చూసి అలా మావయ్య ఆర్ట్ రూమ్ కేసి వెళ్ళాను. కొన్ని పేయింటింగ్స్ చూస్తే “భలేగా ఉన్నాయే” అనిపించింది. మావయ్య ఏదో ఆలోచిస్తూ నేను వచ్చింది గమనించి “రామ్మా. దా ఇలా కూర్చో” అన్నారు. బాబోయ్ ఎందుకు ఇటు వచ్చానా అని అనుకుంటూనే వెళ్ళి కూర్చున్నాను.

నన్ను కూర్చోమని అన్నారే కానీ మావయ్య ఏదో ఆలోచిస్తూ తను వేస్తున్న పెయింటింగ్ కేసి దీర్ఘంగా చూస్తున్నారు. “ఇక్కడ ఏ రంగు బాగ్రౌండ్ బావుంటుంది?” అని అడిగారు. “మేబీ … పింకిష్ ఆరంజ్?” అన్నాను ప్రశ్నార్ధకంగా. “యూ ఆర్ రైట్” అంటూ భలే ఆనంద పడిపోయి అదే రంగు వాడడం మొదలు పెట్టారు. “ఆయన పెయింటింగ్ కి నా సలహానా?” అనుకుంటూ నేను మెల్లిగా ఇవతలిక వచ్చేశాను. ఆయన తన రంగుల్లో ములిగి పోయారు.

ఇంతలో అత్త నాకు ఇష్టము అని చపాతి, పన్నీర్ కర్రి చేసి మా అందరికి పెట్టింది. అందరం తింటున్నాము. పెద్దగా మాట్లాడని మావయ్య “ఆ రంగు ఎందుకు సజెస్ట్ చేశావు?” అని అడిగారు. అంత సడన్ గా అడిగితే ఏంచెప్పాలో తోచలేదు. “అబ్బా … దాన్ని తిననివ్వకుండా ఏంటి మీ రంగుల గోల?” అంది అత్త కొంచం కసురుకున్నట్లు. అలాంటి పరిస్ధితి నేను ఎప్పుడు చూడలేదు. సమాధానం చెప్పాలా వద్దా … పెద్ద సందిగ్ధత. అక్క, నేను దెబ్బలాడుకునేడప్పుడు అమ్మ చెప్పే కప్ప—పాము సామెత గుర్తుకు వచ్చింది. మావయ్య ఏమీ అనలేక తలవంచుకుని తినడం మొదలు పెట్టారు. ఐ ఫెల్ట్ హీ ఇజ్ ఇన్ ఫాక్ట్ హామ్లెస్. రంగులంటే నాకూ ఇష్టం కాబట్టి కొంచెం ధైర్యం చేసి, అత్త అలా వంటింట్లోకి వెళ్ళగానే మావయ్యకేసి చూసి “నేను నా డ్రెసెస్ కొనేటప్పుడు కాంట్రాస్ట్ కోసం ఎలా చూస్తానో ఆ ఉద్దేశంతో చెప్పాను” అన్నాను. “ఊ … వెరీగుడ్. యుూ ఆర్ అబ్జర్వెంట్ …” అంటూ ఇంకా ఏదో చెప్పబోయి అత్త రావడం గమనించి ఆగి పోయారా అనిపించింది.

భోజనం తరువాత అత్త మావయ్యకి మజ్జిగ చేసి ఇచ్చింది. ఒక్క సారిగా తాగేయబోయి ఆగి పోయారు మావయ్య. ఇప్పటికీ తలుచుకుంటే వళ్ళు జలదరిస్తుంది. అందులో జీవచరాలు. మావయ్య అత్తకి చూపించారు. వెంటనే అత్త అరవడం మొదలు పెట్టింది. ఏనాడూ మావయ్య వంటింటిని పట్టించుకోలేదని, బాగు చేయించ లేదని, పెస్ట్ కంట్రోల్ కొట్టించ లేదని … అప్పుడు మజ్జిగలో ఏమైనా రావచ్చని … వగైరా, వగైరా!

… మావయ్య మారు మాట్లాడకుండా తన ఆర్ట్ రూమ్ లోకి వెళ్ళారు. అసలు వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానా అనిపించింది. కాకపోతే, అలా జరిగితే, అమ్మ వెంటనే నోరు కడుక్కోమనో లేక ఏదైనా వేరేది టేస్ట్ కోసం ఇవ్వడమో చేసేది అనిపించింది.

ఆ రోజు నేను అత్త వాళ్ళ గదిలో పడుకున్నాను. ఓ అరగంట తరువాత అత్త కూడా అక్కడ పడుకోవడానికి వచ్చింది. నేను పడుకున్నాను అనుకుని తనూ అలా వాలింది. ఇంతలో నాన్న ఫోన్ చేశారు. అత్త మాట్లాడుతూ ఉన్నట్లుండి ఏడుస్తూ గదిలోంచి బయటికి వెళ్ళింది. కొద్ది నిమిషాల్లో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చి పడుకుంది. ఇదంతా చూసిన నాకు నిద్దర హూష్ కాకి అయిపోయింది. ఇది సరిపోదు అన్నట్లు మర్నాడు ప్రొద్దున్నే, నాన్న వాళ్ళ ఫ్రెన్డ్స్‌తో వచ్చి, అత్తని గది తలుపులు వేసి కాదు దమ్ముంటే తన ముందు కొట్టమని, భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోమని అరిచి గోల చేసి, మావయ్యకి వార్నింగ్ ఇచ్చి నన్ను తీసుకుని వచ్చి కారులో బయలుదేరారు. “నాన్న, అసలు ఏమి జరిగింది అంటే …” అని అనేంతలో, “నాకు అన్నీ తెలుసు. నువ్వు చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ చూసిందంతా మరచిపో” అని గద్దించారు. నాకు నోట మాట పెగల్లేదు.

నా డిగ్రీ పూర్తి అయింది. నేను ఏదైనా ఫర్మ్ లో చేరటమో లేక ప్రాక్టీస్ మొదలు పెట్టడమో చేద్దాము అనుకున్నాను. కానీ అమ్మ పెళ్ళి ప్రస్థావన తెచ్చేసింది. నాన్న కూడా సై అన్నారు. ఒక గంటలో పెళ్ళికొడుకుల లిస్ట్ కూడా ముందుకు వచ్చేసింది. నా ఇష్టం ఎవరికీ పట్టలేదు అనిపించింది. అవతలికి వెళ్ళి అక్కకి నా మనసులో మాట చెప్పాను.

ఐదు నెలల తరువాత పదహారు రోజుల పండగ మా ఇంట్లోనే జరగాలని పట్టుబట్టింది అత్త. ఆ రోజు రాత్రి భోజనం చేశాక అత్త అందరికి మజ్జిగ ఇచ్చింది. ఈ సారి జీవచరాలు నాన్నని వరించాయి. అత్తని పక్కకి పిలిచి అడిగారు. అత్త షరా మామూలే అన్నట్లు మావయ్యని మాటలు అనడం మొదలెట్టింది. నాన్నకి నోట మాట రాలేదు. ఇదంతా అమ్మ కూడా చూస్తూనే ఉంది. మొహం మాడ్చుకున్నారు నాన్న, అత్త. వెంటనే బయలుదేరతామని అమ్మ, నాన్న లేచారు. బయట కార్‌లో కూర్చున్నాకా, నేను ఒకసారి మాట్లాడి వస్తానని బావకి సైగ చేస్తే అర్థం చేసుకుని లోపలికి వెళ్ళాడు.

అప్పుడు నేను నాన్నతో అన్నాను “ఏంటి నాన్న, మొహం అలా ఆముదం తాగినట్లు పెట్టావు? ఇదే విషయం నేను నీకు కొన్ని ఏళ్ళ క్రితం చెప్పబోతే ఇదే కార్ లో నన్ను నోరు మూసుకోమన్నావు? అందుకే గద ‘తనదాక వస్తే గానీ తెలియదు’ అన్నారు? ఇన్నాళ్ళు అత్త కోసం మావయ్యని తూలనాడావు. ఇప్పుడు నీ కూతురు కోసం నీ చెల్లెలినో నా భర్తనో తూలనాడుతావా? ఏ … నువ్వు అమ్మ మీద ఎన్నడూ చెయ్యి ఎత్తలేదా? అలాగే నీ బావమరుదులు నీ ఇంటికి వచ్చి గోల చేస్తే ఎలా ఉండేదో ఒక్క సారి ఆలోచించు? మందినేసుకుని వెళ్ళి మీద పడితే భయపడి కాపురం చేస్తున్నారు అనుకుంటున్నావా? అసలు నిజానికి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ఓపిక నీకెక్కడిది? … అక్క విషయంలో కూడా ఇంతేగా! పెళ్ళైన తరువాత, ఒకళ్ళనొకళ్శు అర్థం చేసుకోవడానికి రెండు మూడేళ్ళైనా పట్టదూ? ఆ టైమ్ వాళ్ళకి ఇచ్చారా మీరు? ఎన్ని ఏళ్ళు అయినా మీరు అనుకున్నట్లే మీ ఆడపిల్లలు సుఖపడాలి అనే మీ పిచ్చి ఉన్నంత కాలం మీరే వాళ్ళ సుఖాలకి అడ్డుగోడలు. ఏ … మీ అమ్మ మా అమ్మని ఎంత బాగా చూస్తోందో మన చుట్టాలు అందరికీ తెలియని విషయమా? … ఔను, బావకి ఏవో షరతులు పెట్టావట? అవి నాతో చెప్పకూడదు అన్నావుట? నాకూ, బావకి మధ్య నీ షరతులేంటి? నాకు అన్నీ పెళ్ళికి ముందే చెప్పాడు. బావ చదువుకున్న వాడు. బుద్ధిమంతుడు. కచ్చితంగా అవి మీ చెల్లెలి దగ్గర నుండి మాత్రం రాలేదు. అదీగాక, ఢిల్లీలో వచ్చిన ఆఫర్ తీసుకుని వీలైనంత తొందరగా అక్కడికి వెళ్ళిపోమన్నావుటగా? ఏమిటో ఈ చోద్యం? మీ ఇంట్లో పిల్లని చేసుకుంటే వేరే కాపురం పెట్టవలసిందేనా? … ఎనీహౌ, ఇప్పుడు ఇది నా ఇల్లు. ఇది నా సంసారం. కాబట్టి, అత్త సంసారంలోనూ, అక్క సంసారంలోనూ ఇంటర్ఫియర్ అయినట్లు నా సంసారంలో కూడా దూరవు అనుకుంటున్నాను. బై ద వే, నువ్వు వాళ్ళ మధ్య దూరి చేసిన మంచి ఏంటి? అత్త కోసం, అక్క కోసం పోరాడావా? ఏం సాధించాలాని? ఏం సాధించావు? అంతెందుకు వాళ్ళని నీ దగ్గరే ఉంచుకుంటే బాగా సుఖపడే వాళ్ళేమో? … ఇవాళైనా నిజం తెలిసింది అనుకుంటా. అయినా, అమ్మపుట్టిల్లుమేనమామకి తెలియదా అన్నట్లు, అత్త గురించి నీకు తెలియకపోతే కదా! ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పు; తమ్ముడికి పెళ్ళి చేద్దాము అనుకుంటున్నావు కదా, అత్తలాంటి పిల్లని ఇచ్చి చేస్తావా? … మరీ అలా నోరెండబెట్టకు. మాట వరుసకి అడిగాను, అంతే. ఎంతైనా వాడు నా తమ్ముడేగా! అయినా, అత్త చెడ్డది కాదు. ఈ వారం రోజుల నుండి గమనిస్తున్నాను కదా. తను చేయాలనుకుంటే తప్పకుండా చేసి పెడుతుంది. కాకపోతే, సోమరి. అదీగాక, ప్రతిదానికి తన అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతుంది. దానికి మించి మీరు పెంచి పోషించిన అహంకారం. సో, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒక మనిషి కావాలి. అందు కోసం ప్రతి చిన్న విషయానికి మావయ్యని టార్గెట్ చేస్తుంది. “మొగుణ్ణి కొట్టి మోక్షానికి మెరెట్టింది” అన్నట్టు లేదూ? ఇంక ఎలా సుఖపడుతుంది? ప్రతి రోజూ నరకమేగా? అసలు నువ్వు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే వాళ్ళ సంసారం కూడా చక్కగా ఉండేది. కాదా? … డోన్ట్ వర్రీ. నాకు కావలసినవి బావకి నెమ్మదిగా చెప్పి చేయించుకుంటా. కుదరకపోతే ఊరుకుంటా. కానీ, ఎవ్వరినీ మా కుటుంబ విషయాలలో తల దూర్చనివ్వను. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా? …

ఇప్పటికైనా ఆలోచించు. ఈ విషయం ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియ లేదు నాన్న.” … కోపంతో నాన్న కారు స్టార్ట్ చేశారు.

నాలో అంత ధైర్యాన్ని నింపిన అమ్మకి జోహార్లు. తల్లే కదా ఆడపిల్లకి సంసారాన్ని ఎలా నడుపుకోవాలో, ఎలా నిలుపుకోవాలో చెప్పవలసిన మనిషి! ఇప్పటికీ అదే కరక్ట్ అనిపిస్తుంది. ప్రతి ఆడదాని సక్సెస్‌ వెనకాల కూడా మరొక ఆడదేగా ఉండేది!

ఒక నెల రోజుల తరువాత అత్త నుండి నాన్నకి నా మీద కంప్లైన్‌ట్ వెళ్ళింది. “ఇంకెన్నాళ్ళు ఇలా భరిస్తావు వచ్చి మా ఇంట్లో ఉండిపొ”అని చెప్పారుట నాన్న అత్తకి. కిమ్మన్నాస్తి. ఇన్నేళ్ళు నాన్నకి ఈ చిన్న మాట చెప్పే పెద్ద దిక్కే లేక పోయిందే అనిపించింది!

అదిగో చీకటి పడుతోంది. కాళ్ళు స్వాధీనంలోకి వచ్చాయి. ఇంక నాకోసం వంటిల్లు ఎదురు చూస్తోంది.

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(TP) 2. గొలుసు కుట్టు

ఆ.
జగమెరిగిన జాణ ఛాయా చిత్రము
మార్చి మార్చి జూప మరువ గలమె?
చేతివాటమెంత చేవగలిగినను
ఈశ్వరేచ్ఛ వరకె ఇంగితమ్ము!

ఆ.
పట్టుబడక తిరుగ పరువు బరువుగాదె?
తెలివితోడజూప తెగువ, ఇంటి
దొంగ చేయు పనులు దొరతనమందురె?
మేకవన్నె పులులు మెండు గాదె!

(TP) 1. ఇక్కడ మూడేళ్లు తదుపరి పాతికేళ్లు

ఇక్కడ చపాతీ తిన్నాము, ఉప్మా తిన్నాము, కిచిడి తిన్నాము, పులిహోర తిన్నాము
ఈ పాతికేళ్లలో చపాతి, కిచిడి, పులిహోర వగైరా అయ్యాము!

ఇక్కడ గడ్డం చేసుకోవడం నేర్చుకున్నాం
ఈ పాతికేళ్లలో అది పట్టుకోవడం నేర్చుకున్నాం!

ఇక్కడ ప్రతి మూలా ఏరా అనే పిలుపు
ఈ పాతికేళ్లలో దానికై వెతికాము ప్రతి మలుపు!

ఇక్కడ గట్టు మీద, చెట్టు కింద కూర్చుని ఆలోచించే వాళ్ళము
ఈ పాతికేళ్లలో పరిగెత్తి పాలు త్రాగడం వైపు మళ్ళాము!

ఇక్కడ ఏనాడైనా మెస్సులోంచి నీళ్లు రూంలోకి పట్టుకెళ్ళామా?
ఈ పాతికేళ్లలో ప్లాస్టిక్ బాటిలే మన రెండో పెళ్ళామా?

ఇక్కడ కృష్ణమ్మ నీరు, పాఠాలు జోరు, స్నేహితుల ప్యారు
ఈ పాతికేళ్లలో పన్నీరు, మున్నారు, రెండు పుస్తెల జీవితం క్యారు క్యారు!

ఇక్కడుండగా విన్నా ... డబ్బు ప్రాణమంటి మనుషుల మధ్య పగ పెడుతుందని
ఈ పాతికేళ్లలో కన్నా ... గాలి, నీరు, తిండితో కూడ పడనివ్వదని!

ఇక్కడ పొందాము పట్టాలు
ఈ పాతికేళ్లుగా మన బండి దిగలేదు పట్టాలు!

అయినా సరే, వెనక్కి తిరిగి చూస్తే
మూడేళ్ల మురిపం మిన్న
పాతికేళ్ల ప్రయాస కన్నా!

——******——

PS. APRDC, నాగార్జున సాగర్‌లో చదువుకున్న తరువాత సిల్వర్ జూబ్లీకి, 2018లో, కలవాలనుకున్నప్పుడు వచ్చిన జ్ఞాపకాలివి.

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 4. Catering Manager

In an Indian wedding party
Catering is charity.
Hosts spend, guests chill;
Hosts’ onus, guests’ thrill.

The venue and its location,
The facilities and decoration,
All glean to appeal,
If not, anything can repeal.

Hosts and guests hug,
Showing up the hype big and big;
Even on such an occasion,
Can we see ego submission?

Water, juice, coffee or tea
He would, in person, offer with a gentle glee;
All day, walk through to every corner,
Young or old, politely ask and handover.

Wearing kurta-dhoti, bald head and a smile,
Walk unambiguously like a relative of all.
Host, guest or servant, service is the rule,
This grand old man knows no beguile.

If we like simple, sincere,
Dedicated and spiritual air,
We have lessons to learn for mind and body,
We have lessons to learn for mind and body.
PS. I saw this old man at a family function in a big hall in DD Colony in Hyderabad, India, in 2009.

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 3. Road Rule, a Child’s Play?


Dear Parents,

Please teach your school-going child
How to cross the road,
And your college-going grown-up
Why to follow a road rule——

Look on either side near the Zebra-crossing
No zig zag fancy while driving;
Use horn, blinker, seat-belt and helmet
To not to remind the fellow commuters of kismet.
Let high-beam lights illuminate,
And not allow the brightness shower darkness.

Speeding leads to concern
Instead, look, think and discern.
All (e)documents are mandatory
And ignorance is predatory.
Commonsense should prevail
If not, it may not be a smooth sail.

The nursery rhyme still holds – “Stop says the red ...”
So that the onlookers realise, “he's well-bred!”

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 2. Lockdown Laurels

Lockdown(LD) has given us an easy way to understand a paradox
It’s like handing over someone a hard copy of the fax!
As the most sophisticated animal is invaded by the invisible
Man is shut; animals venture out; it’s visible!

Comparison makes relationship tentative
During LD, increase in divorce rate is representative;
Love and affection make relationship effective
During LD, increase in expected birth rate is indicative!

Peck and handshake have become contactless
As social distancing made them clueless
‘Touch me not’ is now an accepted discrimination
Masking oneself is the best identity and revelation!

Students greet teachers in the chat boxes
Virtual eye-contact is the greatest of jinxes
Entering the class is with an interest to exit
Log in to log out is very fair and fit!

Vehicles went off the roads; pollution too
Roads emptied to be filled again; pollution too
Birds chirped in the balconies; nature too
Man got in to get out; nature too!

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 1. You Are Known by Your Mask!

A panoramic view of the pandemic
As it grew, place to place, from epidemic
The infestation couldn’t be presaged
As the sage in man is caged.

The microscopic virus is so virulent
The macroscopic human misery is that opulent
Our earth has become a global village
Pertinent to give it the unfathomable mileage.

It’s variants have subtle regulation
The antidote lies in surmise and speculation
It leaves no room for a quick vaccination
While the attack goes on — nation after nation.

Where lies the root and where lies the fruit?
Which weapon can shoot and who’s that recruit?
Whom to reach and what’s the preach?
When is the D-day and how to fetch?

While the quest for the invisible is on
While we wait for the solution to be born
While the lockdown is prevention and not cure
While we all comprehend that life continues for sure ...

Let’s pool our wits, and sit and think
Social distancing is a definitive part to break the LINK
Let’s use our rationality and education in this task
For it’s a new norm, “You are known by your MASK 😷!”

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(Hindi) 2. उस रात के लिए …

बैठ बैठ कर अपने आप से करता हूं बात,
जस्बात ही तो है उसकी सुबूत।
सुकून बेच बेच के जीता हूं ये तन्हाई,
पल पल जानता है उसकी गेहराई।

मेरी है दो आंखें,
जैसी ये दुनिया देखें।
एक पूरब है एक पश्चिम,
भाग न पाऊं, रस्ता है मुजरिम।

खरीद लाया हूं कप तीन,
जब आयेंगे दोनों तरफ से मेरी जान,
बनाऊंगा चाय आधी रात में,
घरके ऊपर बैठके तीनों पियेंगे मज़े में।

अस्सी में हूं असली भी हूं,
आंखें खुली या बंद, उनकी राह देखता हूं।
आखिर बेटियों का बाप हूं सच बोलता हूं,
जभ्भी वो आते हैं तब ही त्योहार मनाता हूं।

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(Hindi) 1. अंदाज़ अपना अपना!

जो बरसती नहीं वो बादल किस लिए?
जो अंकुरण नहीं हो सकती वो बीज किस लिए?
जो देख नहीं सकते वो खूबसूरती किस लिए?
जो सुन नहीं सकते वो ग़ज़ल किस लिए?
जो बैठ नहीं सकते वो मेहफिल किस लिए?
जो आजमा नहीं सकते वो जज़्बात किस लिए?
जो निभा नहीं सकते वो रिश्ते बनाना किस लिए?
जो दूर नहीं रह सकते वो जुदाई किस लिए?
जो पास नहीं रह सकते वो नज़दीकी किस लिए?
जो दिल भर नहीं दे सकते वो प्यार किस लिए?

अंदाज़ अपना अपना!

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

3. ఆ మూడు పేజీల్లో …

తన స్నేహితుడితో చాలా సేపు ఫోన్లో మాట్లాడి వచ్చి పడక కుర్చీలో కూర్చున్నాడు చిదానందం. వాళ్ళ తాతల నాటి కుర్చీ. టేకు కలప తెప్పించి దగ్గరుండి చేయించానని చెప్పేది వాళ్ళ నాయనమ్మ. అందుకోసం, ఇంట్లో పెద్ద సోఫాసెట్టు ఉన్నా, ఆ పడక కుర్చీలో కాసేపు కూర్చోకపోతే అతనికి రోజు గడిచినట్టు ఉండదు. అందులో ఇలా కూర్చున్నాడో లేదో, అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చిక్కుడుకాయలకు ఈనెలు తీస్తున్న అతని భార్య, “అయిందా మీరు ఫోన్లో మాట్లాడడం? ఎవరితోనో అంత సుదీర్ఘమైన బాతాఖానీ? అదీ అలా బయటికెళ్ళి మరీనూ …” అంది కొంచెం గీరగా. తన కళ్ళజోళ్ళోంచి అలవాటు ప్రకారం అలా ఓ పక్కచూపు చూసి, చిదానందం, “ఓ … అదా? … మా డిగ్రీ క్లాస్మేట్. నెలకోసారి అలా మాట్లాడకపోతే ఏమిటో అదో వెలితి. ఆ ఐదుగురితోటీ నాకున్న అనుబంధం ఎలాంటిదో నీకు తెలుసుగదా! … ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేక అలా వాకిట్లోకి వెళ్ళి మావిడి చెట్టు కింద కుర్చీ వేసుక్కూర్చుని మాట్లాడాను” అన్నాడు. “ఏదో సరదాకి అన్నానండి. నాకు తెలియనిదా మీ అనుబంధం. సరేగానీ, వాళ్ళ అమ్మానాన్న, పిల్లలు అంతా కులాసాయేగదా?” అంది అతని భార్య. “ఆ … అందరూ క్షేమంగా ఉన్నారు. వచ్చే నెల వాళ్ళు ఇండియాకి వస్తారుట.” అన్నాడు చిదానందం. “సో, శ్రీవారు ఆ మిగతా నలుగురి చేతా కూడా సెలవు పెట్టించే కార్యక్రమంలో ఉంటారన్నమాట!” అంటూ ఆ వొలిచిన చిక్కుడుకాయ ముక్కలు తీసుకుని బెల్లం పెట్టి వండటానికి వంటింటిలోకి వెళ్ళింది అతని భార్య.

ఎందుకో చిదానందం భార్యకేసి అలా చూస్తూ ఉండిపోయాడు. భార్య అన్న ఆ మాటలు చిదానందాన్ని తను డిగ్రీ చదివే రోజులకి టైం మషీన్లో పడేసి తీసుకు వెళ్ళినట్టు తీసుకెళ్ళాయి. ఇంతలో అతని భార్య వచ్చి, “వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో కనుక్కోండి. ఓ కేజీ పండు మిరపకాయలు తెప్పించి కొరివికారం చేస్తాను. సూర్యం అన్నయ్యగారి నోట ‘జిహ్వ చచ్చింది’ అని వినాలని మీ కోరికగా” అంటూ తన భర్త కాలేజీ క్లాసురూములో ఉన్నారని గమనించకుండా చెప్పేసి మళ్ళీ వంటింటిలోకి వెళ్ళిపోయింది.

ఆరోజు మధ్యాహ్నం మొదటి క్లాసు. భారతీయ సంస్కృతి గురించి చెబుతున్నారు వాళ్ళ మాష్టారు. మొదటి రెండు మూడు వరుసల్లో కూర్చున్న చిదానందం, అతని స్నేహితులు కళ్ళు పెద్దవి చేసి, చెవులప్పగించి మధ్యాహ్నం భోజనం తరువాత వచ్చే నిద్ర కళలు కనిపించకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆవులింతలొస్తే అవి మాష్టారుకి కనబడకుండా చేతులు, జేబురుమాలు, పుస్తకాలు వాడడంలో వాళ్ళకి వాళ్ళే సాటి. అలాంటి విషయాలలో వాళ్ళందరికీ ఉన్న కోఆపరేషన్ మరియు కోఆర్డినేషన్ వర్ణనాతీతం. ఒకరిని మించిన వారు ఇంకొకరు. అవసరమైతే మాష్టారునే తికమక పెట్టేయగలరు. కుర్రకారు కదా!

మాష్టారు పాఠం మొదలుపెట్టిన కాసేపట్లో చిదానందం కుడి ప్రక్కన కూర్చున్న కుర్రాడు మోచేత్తో పొడిచి వెనక్కి చూడమని సైగ చేశాడు. ముందు మాష్టారుకేసి చూసి, ఆయన తనవైపు చూడటం లేదన్నప్పుడు అలా వెనక్కి ఓ లుక్కేశాడు. వెనకాతల కూర్చున్న సూర్యం, మిగతా క్లాస్మేట్స ముసిముసి నవ్వులు నవ్వు తున్నారు. విషయం ఏమిటో అర్థం కాలేదు. కానీ సూర్యం మాష్టారుకేసి చూస్తూ ఏదో వ్రాస్తున్నాడు. ఇంతలో మాష్టారు తెల్లవారి పాలనలో మన భారతీయ సంస్కృతి గురించి చెప్పడం మొదలు పెట్టారు. వారి పాలన మనలను ఎంతో చేతకానివారిని చేసిందని సూర్యం చాలా ఘాటుగా వాదించేవాడు. అంచేత, అతను టక్కున లేచి నిలబడి, “మాష్టారు, ఈ మధ్యనే మా తెలుగు మాష్టారు చిలకమర్తి లక్షీనరసంహం పంతులుగారు వ్రాసిన ఒక పద్యం చెప్పారు:

తే.
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.

అని టకటకా ఆ పద్యం చెప్పి, “Sir, don’t you think the British rule spoiled our rich heritage and culture?” అని అడిగాడు. ఇంగ్లీషులో పాఠం చెబుతున్న ఆ సిటీబ్రెడ్ మాష్టారుకి అసలు తెలుగు పద్యమే అర్థం కాలేదు. ఆయన అతని దగ్గరకొచ్చి, ఆ పద్యం కాగితం మీద వ్రాయించుకుని దాన్ని తన జేబులో పెట్టుకుని, “Let me speak with one of our Telugu lecturers and get the essence of this poem. So, only then I can respond to your question. Okay … so, I was referring to …” అంటూ తన శైలిలో పాఠంలోకి వెళ్శపోయారు.

ఆయనతో మాట్లాడుతున్న ఆ కొద్ది క్షణాలు కూడా సూర్యం తన పుస్తకంలో ఏదో వ్రాస్తూనే ఉన్నాడు. అది చూసి పక్కనే కూర్చున్న వాళ్ళు వాళ్ళ నవ్వు ఆపుకోలేక పోతున్నారు. ఆ నవ్వులు కాస్త ఇబ్బందిగానే తోచినా, తనకు తెలుగు పెద్దగా రాదు గనక, మాష్టారు అదోలా నవ్వి ఊరుకున్నారు. వాళ్ళు నవ్వుతున్నది సూర్యం వేసిన ప్రశ్నకో లేక ఆయన తెలుగు భాషా జ్ఞానానికో కాదని ఆయనకి ఇంకా అర్థం కాలేదు.

ఆయనేమో సీరియస్ గా పాఠం చెప్పేస్తున్నారు. సూర్యం మూడు పేజీలు అటూ ఇటూ తిప్పేస్తూ ఏదో వ్రాస్తూనే ఉన్నాడు. క్లాస్ రూమ్ లో నవ్వటం ఎక్కువైపోయింది. అందులో ఇలాంటి విషయాలు నోట్లో అసలు నానవుగా. ఈ గందరగోళంలో అందరూ సూర్యం వైపే చూడటం మాష్టారు గమనించారు. అతని దగ్గరకి వెళ్ళారు. “So, Suryam, what’s the matter?” అన్నారు. అతను పేజీ తిప్పి వ్రాస్తూనే “Nothing, Sir” అన్నాడు. ఆయన ఒకసారి నవ్వుతున్న అందరికేసి చూసి, “ఏంటి సంగతి?” అన్నట్టు అతనికేసి చూశారు. సరైన సమాధానం రాకపోయేసరికి, ఆయన సూర్యం పుస్తకం తీసుకుని చూశారు. ఒక పేజీలో 1 నుండి 129 వరకు, ఇంకో దాంట్లో 1 నుండి 36 వరకు, మరొక దాంట్లో 1 నుండి 54 వరకు అంకెలు వేసి ఉన్నాయి. మాష్టారుకి అర్థంకాక, “What’s this?” అని అడిగారు. సూర్యం ఏమి మాట్లాడాలో అర్థంగాక అడ్డంగా తలకాయ ఊపాడు. ఇంతలో సూర్యం ప్రక్కనున్న ఆ క్లాసులీడరు, “Sir, please don’t take it seriously” అన్నాడు. “That’s fine. But, what’s this?” అని ఆయన మళ్ళీ అడిగారు. అప్పుడు అతను ‘ఇంక చెప్పేస్తున్నాను’ అన్నట్లు సూర్యంకేసి చూసి సైగచేసి, “Sir, in the last 35 minutes, you used the words ‘so’ 129 times, ‘as a consequence of which’ 36 times and ‘as a result of which’ 54 times.” అన్నాడు. క్లాసు మొత్తం ఒక్కసారి గొల్లుమని మనసార నవ్వేశారు. అందరితోపాటు మాష్టారు కూడా సరదాగా నవ్వేశారు.

ఆది గుర్తుకొచ్చి తనలోతానే నవ్వుకున్నాడు చిదానందం. ఆ పడక కుర్చీలో కూర్చుని ఇలాంటి జ్ఞాపకాలు నెమరేసుకోవడమంటే అతనికి భలే ఇష్టం! ఇంతలో, వంటింటిలోంచి ఘుమఘుమల కబురు రానేవచ్చింది.

——******——

👇~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

2. మహాభారతంలో మంచూరియా

చిదానందం తన భార్య, ఇద్దరు కొడుకులతో ఇండియాలో ఉన్న తన తల్లితండ్రులను చూడాలని అమెరికా నుండి వచ్చాడు. ఓ మూడు నాలుగు వారాలైనా ఉంటాడేమో! అతనికి తన తల్లితండ్రులంటే చాలా ఇష్టం. ఫ్లైట్లో పిల్లల గోల ఎలా ఉన్నా, వచ్చినప్పుడల్లా తన బాల్యాన్ని, ఇంట్లో అందరూ కలసి గడిపిన రోజులని వీలైనన్నిసార్లు గుర్తు చేసుకుని తనలోతానే నవ్వుకుంటూ ఏవో హావభావాలు వ్యక్తపరుస్తూ ఉంటాడు. తనకి అది తెలియని ఆనందం. ఎదుటివాళ్లకి మాత్రం అర్థం కాని వెర్రితనం. ఏది ఏమైనా … వాళ్ళు చేస్తే మంచి ఎదుటివాళ్ళలో చూస్తే పిచ్చి కదా!

వచ్చి నాలుగైదు రోజులైంది. పిల్లలు చిదానందం తండ్రిని గ్రాండ్పా అవి పిలవడం తగ్గించి, “థాతయ్య” అనే పదాన్ని అమెరికన్ ఇంగ్లీషు ఉచ్చారణతో పిలవడం మొదలైంది. గుడ్డిలోమెల్ల అని సరిబెట్టుకున్నారు ఈ రిటైర్డ్ తెలుగు మాష్టారు. అటు మనవళ్ళ మీద ప్రేమ, ఇటు తల్లిలాంటి తెలుగు భాష మీద ఉన్న ఇష్టం. రెంటికీ మధ్య నలిగిపోతున్నట్లనిపించినా, పెద్దరికం ముసుగులో దాన్ని దాచేసి ఎంచక్కా తన మనవళ్ళని నోరారా “ఏరా తాతయ్య” అని పిలుస్తూ ఆనందిస్తున్నారు ఆ తాతగారు. అయినా కానీ, మనవళ్ళకి ఎంతోకొంత తెలుగు నేర్పాలనే కుతూహలం మాత్రం ఆగమంటే ఆగుతుందా? డాక్టర్ ఎప్పుడైనా డాక్టరే; మాష్టారు ఎప్పుడైనా మష్టారే కదా!

అలా ఓక ఆదివారం సాయంత్రం ఒక తెలుగు ఛానల్లో అష్టావధానం మొదలయింది. తాతయ్య దాన్ని, గారెల్లో అన్నం పరవన్నంలా, కొత్తావకాయలో పెద్దరసంలా, గోంగూరపచ్చట్లో ఉల్లిపాయ ముక్కల్లా … రకరకాల రుచులు ఆస్వాదిస్తూ చూస్తున్నారు. ఇంతలో మనవళ్ళు అల్లరి చేస్తూ పరిగెత్తుకొచ్చారు. గబుక్కున చిన్నవాడు ఆయన మీదెక్కి కూర్చుని “థాతయ్య, సీ, హీజ్ బీటింగ్ మీ” అన్నాడు. తాతయ్య వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, “ఆ బడుధ్ధాయకి నేను లెంపలు వాయిస్తాలే గానీ, ఇప్పుడు చెప్పింది నాకు తెలుగులో చెప్పు” అన్నారు. వాడు, “థాతయ్య, ఛూడు, వాడు నాకి ఖొట్టింగ్ మీ” అన్నాడు. అది విన్న తాతయ్యకి పరవన్నంలో బెల్లం, ఆవకాయలో ఉప్పు, గోంగూర పచ్చట్లో ఇంగువ పోపు లేకుండా తిన్నట్టనిపించింది.

ఇలా అవధానం సాగుతోంది.

ఉత్సాహం ఆగని తాతయ్య, మనవళ్ళనిద్దరినీ పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆ అవధానంలో సమస్యాపూరణంలో ఇచ్చిన కంద పద్యపాదం చెప్పారు. “ద్రౌపది కురుపాండవులకు దౌత్యము సేసెన్” అని. శ్రీమదాంధ్రమహాభారతం అంటే చాలా ఇష్టం కనుక, తాతయ్య అప్పటికే రోజూ రాత్రి పూట తన మనవళ్ళని తన దగ్గర పడుకోబెట్టుకుని కొంత కథ చెప్పారు. కాబట్టి, వాళ్ళకి పాండవులు, కౌరవులు, వాళ్ళ మధ్య వైరము తెలిసాయి. ఆ ధైర్యంతో తాతయ్య ఈ పద్యపాదాన్ని వాళ్ళకి అర్థమయ్యే తెలుగులో చెప్పటం మొదలు పెట్టారు.

అది చెవిన బడిన నాయనమ్మ, అదేదో విందామని వంటింట్లోంచి అక్కడికొచ్చి నిలుచుంది. తాతయ్య, “ద్రౌపది … పాండవులకు, వాళ్ళ కజిన్స్, అంటే కౌరవులకు … దౌత్యము, అంటే సంధి చేసిందిట. అంటే …” అని చెప్పబోయేంతలో, పెద్ద మనవడు, “యా … థాతయ్య. ఐ గాటిట్. అంటే, ఇట్స్ లైక్ … వెజ్ మంఛూరియా ఛేసిందా, థాతయ్య?” అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక నోళ్ళెండబెట్టి చూస్తూన్న తాతయ్య నాయనమ్మల పరిస్థితి ఊహించి, ఇదంతా ప్రక్క గదిలోంచి వింటున్న చిదానందం “సిరికింజెప్పడు …” అన్నట్లు పరిగెత్తుకొచ్చాడు. తన భార్య వెనక్కాలే వస్తూ, ఏదో పరధ్యానంలో “బట్, ‘చిద్దూ’, ఆ రోజుల్లో కూడా ఇండియాలో …” అంటూ డిస్క్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. మరి అందరి ముందూ “ఏవండీ” అని పిలుస్తానని తనే మరచిపోయినట్లుంది. తాతయ్య, నాయనమ్మ, చిదానందం, ఆ తల్లీకొడుకులకేసి నోళ్ళెండబెట్టి చూస్తూ ఉండిపోయారు!

——******——

👇~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

1. ఆవ ఘాటు

చిదానందం: ఏమోయ్, ఆవపెట్టి పులిహోర కలుపుతున్నావా? … నిన్న, కందిపప్పు వేయించి వండిన ముద్ద పప్పు, కొబ్బరి తురిమి పెట్టిన మజ్జిగ పులుసు సూపరనుకో!

భార్య: ఔనా? మరి పప్పులోకి కొత్తావకాయ, అందులోకి మీగడ గిలక్కొట్టి తీసిన ఫ్రెష్ వెన్న కాంబినేషనో?

చిదానందం: అది ఇంకా సూపరు! అందుకేగా ఒక ముద్ద ఎక్కువ లాగించింది. అయినా నీ చేత్తో పెట్టిన ఆవకాయ ఏడాది పొడుగూ కొత్తావకాయలాగే ఉంటుందంటే నమ్ము. అందులోకి నువ్వు వేసే మీగడైతేనేమి, అది గిలక్కొట్టన వెన్నయితేనేమి, అలా నోట్లో కరిగిపోతుందనుకో.

భార్య: మరి మొన్న రోట్లో చేసిన పచ్చి ఉల్లిపాయ కారం?

చిదానందం: రోట్లో చేసిందా? అందులో చేస్తే ఆ రుచే వేరు. ఉల్లిపాయ ముక్కలు నలిగినలగకుండా కచ్చాపచ్చాగా, అన్నంలో కలుపుకుంటే తెలీకుండా మూడు సార్లు అదే అవుతుంది.

భార్య: నిజమేనండోయ్. మరి విసిరిన కందిపొడి, కాచిన నెయ్యి ఎలా ఉన్నాయంటారు?

చిదానందం: మరీ ఊరించేస్తున్నావోయ్. కాచిన నెయ్యికి వంకలేముంటాయ్ డియర్? కమ్మదనానికి అదే పెట్టిందిపేరైతేనూ!

భార్య: అంటే మొన్న పండక్కి చేసిన గారెలు, బొబ్బట్లు …

చిదానందం: నువ్వు చేస్తే వంకేంటోయ్? గారెల్లోకి అల్లప్పచ్చడి, అన్నం పరవన్నం. వేడివేడి బొబ్బట్లు. దేనికదే రుచి. ఈ అదృష్టం ఎందరికి పడుతుందంటావ్?

భార్య: ఔనండోయ్ … మరి ఆ అదృష్టం కాస్త నాక్కూడా అంటుకుంటే ఎలావుంటుందంటారు?

చిదానందం: భేషుగ్గా ఉంటుంది. అయినా నీ పిచ్చి గానీ నీ చేతి రుచులు నీకు నచ్చక పోవడమేంటి?

భార్య: అబ్బా నా ఉద్దేశం అది కాదు. ఇది వరకటిలా కాకుండా మీ జీతం బ్యాంకులో పడుతోందా? అలాగే, కరెంటు బిల్లు, ఫోను బిల్లు, గ్యాసు బిల్లు అన్నీ ఆన్లైన్లో ఇంట్లోంచే సులువుగా కడుతున్నారా? ఇంట్లో కూర్చుంటే సమస్తం గుమ్మంలోకొచ్చి పడుతున్నాయా? అలాగే నా పని కూడా కాస్త సులభం చేసుకుందామని …

చిదానందం: దాందేముందోయ్? తప్పకుండా. నీకేంకావాలో చెప్పు. కుదిరితే కాదంటానా?

భార్య: అదేనండి … బట్టలకి, గిన్నెలకి, గదులు తుడవడానికి పనమ్మాయిని పెట్టుకున్నా, రోజూ మూడుపూటలు వండి వార్చడం నా వల్ల కూడా అవట్లేదు. మన పక్కవాళ్ళు, అదే మీ బళ్ళో అకౌంట్సు క్లార్కు వాళ్ళకి, మూడుపూటలకి సరిపడ ఒకేసారి వండేసి వెళిపోతుందండి వంటావిడ.

చిదానందం: ఔనా?

భార్య: ఔనండీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెచ్చబెట్టుకుని ఎంచక్కా తినేయచ్చు. ఏవంటారు?

చిదానందం: తప్పకుండానోయ్. ఆ నాలుగు పనులూ చేసేవాళ్ళతో ఇంకో పనివాణ్ణి కూడా పెట్టుకోవాలి.

భార్య: ఎవరిని?

చిదానందం: మనందరిని పోషించేవాడిని.

ఇంక పులిహోరలో ఆవఘాటు నషాళాన్నంటేస్తుందేమో!

——******——

👇~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

Design a site like this with WordPress.com
Get started